కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో (Kolkata Hospital) 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందన్న దానిపై కీలక సమాచారం సేకరించింది. ఆగస్ట్ 8న అర్ధరాత్రి వేళ బాధిత జూనియర్ వైద్యురాలు, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం సెమినార్ గదికి వారు వెళ్లారు. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు.
కాగా, తెల్లవారుజామున 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. సెమినార్ హాల్, డాక్టర్లు విశ్రాంతి తీసుకునే గది, ఇంటర్న్‌ల గది కూడా మూడవ అంతస్తులో దగ్గరగా ఉన్నాయి.
మరోవైపు మరునాడు ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. తన సహోద్యోగులకు, సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.