కోల్‌కతా: లేటు వయసులో పెళ్లి చేసుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ తన సవతి కొడుకును కోల్పోయారు. (Dilip Ghosh Loses Stepson) భార్య రింకూ మజుందర్ కుమారుడు శ్రీంజయ్ దాస్‌గుప్తా మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో మరణించాడు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అతడు తల్లి తనను వీడి ఘోష్ ఇంట్లో ఉండటంపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుస్తున్నది. బీజేపీ మాజీ ఎంపీ, మాజీ బెంగాల్ పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ 60 ఏళ్ల వయస్సులో బీజేపీ మహిళా విభాగం నాయకురాలైన రింకూ మజుందర్‌ను ఏప్రిల్ 18న పెళ్లి చేసుకున్నారు. ఆమె తొలి భర్త సంతానమైన 26 ఏళ్ల శ్రీంజయ్ దాస్‌గుప్తా ఐటీ సంస్థతో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి న్యూ టౌన్ ఫ్లాట్‌లో అతడు మరణించాడు.
కాగా, తీవ్రమైన రక్తస్రావంతో కూడిన ప్యాంక్రియాటైటిస్ సమస్య వల్ల శ్రీంజయ్ మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. అయితే పెళ్లి తర్వాత తాను దిలీప్ ఘోష్ ఇంటికి మారడంపై కుమారుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలిసిందని రింకూ మజుందర్ తెలిపారు. ‘అతడు సరిగ్గా తినడం లేదని, మందులు వేసుకోవడం లేదని నాకు తెలుసు. తన అంసంతృప్తిని ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ ఒక తల్లిగా కుమారుడి బాధను అర్ధం చేసుకున్నా. ఘోష్ ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నా. ఆదివారం ‘మదర్స్ డే’ రోజున వచ్చి కలిసి గిఫ్ట్స్ ఇచ్చాడు’ అని మీడియాతో అన్నారు. అతడి స్నేహితురాలితో త్వరలో కుమారుడి పెళ్లి జరుగాల్సి ఉందని చెప్పారు.
మరోవైపు సవతి కుమారుడ్ని కోల్పోవడంపై దిలీప్ ఘోష్ ఆవేదన చెందారు. ‘ఇది నా దురదృష్టం. నేను చాలా దురదృష్టవంతుడ్ని. కొడుకు పుట్టడం వల్ల కలిగే ఆనందాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు. కానీ ఒక కొడుకును కోల్పోయినందుకు నేను దుఃఖిస్తున్నా. శ్రీంజయ్ నాకు చాలా దగ్గరయ్యాడు’ అని వాపోయారు.