బెంగుళూరు: మైక్రోసాఫ్ట్ చైర్మెన్, సీఈవో సత్యా నాదెళ్ల(Satya Nadella) ఇవాళ బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌లోని కృత్రిమమేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్లోడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది భారతీయులకు కృత్రిమ మేధపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ఉత్తమైన మౌళిక సదుపాయాల్ని కల్పించనున్నట్లు చెప్పారు.
సుమారు 17.5 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు సత్యానాదెళ్ల తెలిపారు. ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్‌కు చెందిన అత్యంత భారీ పెట్టుబడి ఇదేఅని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చైర్మెన్ తెలిపారు. అజూర్ కంప్యూటర్ వ్యవస్థపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 70 కన్నా ఎక్కువ సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయన్నారు. భారత్‌లోనూ మైక్రోసాఫ్ట్ సెంటర్లు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. గిట్‌హబ్ లో 2030 నాటికి ఇండియా నెంబర్ వన్‌గా మారుతుందని ఆయన అంచనా వేశారు.
భారత్‌లో జియోతోనూ భాగస్వామ్యం ఉందన్నారు. 2026లో కొత్త డేటా సెంటర్ ప్రాంతం ఆపరేషనల్‌గా మారనున్నట్లు నాదెళ్ల చెప్పారు. దక్షిణమధ్య భారతంలో కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోనున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సుమారు రెండు కోట్ల మంది భారతీయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు నాదెళ్ల తెలిపారు. ప్రభుత్వానికి చెందిన ఈ-శ్రమ్ ప్రోగ్రామ్ ద్వారా అసంఘటిత కార్మికులను ఏఐతో చైతన్యపరచవచ్చు అన్నారు. భారత్‌లోని ప్రతి వ్యక్తిని, ప్రతి సంస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నాదెళ్ల పేర్కొన్నారు.