Rahul Gandhi : వయనాడ్ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిన పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ (Lok Sabha) లో లేవనెత్తారు. కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా మరణించారని, బాధితులను కేంద్రం ఆదుకోవాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ముండక్కాయ్ (Mundakkai) గ్రామం ఘోరంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఇవాళ తెల్లవారుజామునే వయనాడ్‌లో కొండచరియలు విషాదం నింపాయి. కొండచరియల కింద పడి 70 మందికిపైగా మరణించారు. ముండక్కాయ్ గ్రామం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. ఈ విషయం మీద నేను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. బాధితులందరినీ ఆదుకోవాలని, వారికి వైద్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నా. ఈ ఘటనలో నష్టపోయిన బాధితులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాహుల్‌గాంధీ మాట్లాడారు.
నివాసాలు కోల్పోయిన బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పరిస్థితిని సాధ్యమైనంత వేగంగా చక్కదిద్దాలని, పరిస్థితి చక్కబడేంత వరకూ బాధితులకు ఏ లోటు లేకుండా ఆదుకోవాలని రాహుల్‌గాంధీ కేంద్రాన్ని కోరారు. వయనాడ్‌తోపాటు వెస్టర్న్ ఘాట్స్ అంతటా కొండచరియలు విరిగిపడే ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విపత్తులను నిలువరించే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని కోరారు.