(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): వయనాడ్పై ప్రకృతి ప్రకోపం అక్కడి స్థానికులకు చావు, బతుకులను ఒక్కటిగా చేసింది. మంగళవారం తెల్లవారుజామున విరిగిపడ్డ కొండచరియలు , బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. బురద ప్రవాహం ఇండ్లమీదకు దూసుకురావడంతో ఆ మట్టిలోనే కూరుకుపోయారు. దీంతో తాము ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితి వారిది. చేతుల్లో, జేబుల్లో ఫోన్లు ఉన్న కొందరు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు అందరిని కలిచి వేస్తున్నాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన కొందరు ఇంటర్నెట్లో కంట్రోల్ రూమ్ నంబర్లను వెదికి.. తమను కాపాడాలంటూ కాల్స్, మెసేజీలు చేసినట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.
చూరల్మల ప్రాంతంలోని ఓ మహిళ తమ ఆత్మీయులకు ఫోన్ చేసి.. తాను బురదలోపల కూరుకుపోయానని.. వచ్చి వెంటనే తనను కాపాడాలంటూ ఫోన్లో అర్థిస్తూ చేసిన రోదన సోషల్మీడియాలో వైరల్గా మారింది. కొండచరియలు విరిగి పడే సమయంలో భూమి కంపించినట్టు అయ్యిందని, దీంతో తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని.. చూరల్మల, ముండకైకు చెందిన పలువురు వాపోయారు.