న్యూఢిల్లీ: కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తున్నది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో రాష్ట్రం ప్రతి ఏటా విలవిలలాడుతున్నది. కేరళలో ప్రతి ఏడాదీ ఈ తీరు సర్వసాధారణంగా కనిపిస్తున్నది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వర్ష సంబంధిత ఘటనల్లో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. 2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 483 మంది మరణించారు. కేరళపై ప్రకృతి విపత్తులకు నిపుణులు పలు కారణాలను వెల్లడిస్తున్నారు. కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నదని, రాష్ట్రంలోని 14.5% భూభాగం అందుకు దుర్భలంగా ఉన్నట్టు అంచనా. పర్యావరణ మార్పులు, అటవీ నిర్మూలన వంటివి వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలూ విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు.
దేశంలో కేరళలోనే అధిక సంఖ్యలో కొండ చరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకొంటున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంట్లో వెల్లడించింది. 2015-22 మధ్య 3,782 ఘటనలు చోటుచేసుకోగా, వాటిల్లో 2,239(59.2%) ఒక్క కేరళలోనే జరిగాయని తెలిపింది. మొత్తం 1,848 చదరపు కిలోమీటర్లు(రాష్ట్రం విస్తీర్ణంలో 4.75%) ‘హై ల్యాండ్ైస్లెడ్ హజార్డ్ జోన్’గా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ గుర్తించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదు గమనించాల్సిన అంశమని కేరళ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త రాజీవ్ పేర్కొన్నారు.
1.కేదార్నాథ్, ఉత్తరాఖండ్(2013)
2.మాలిన్, మహారాష్ట్ర(2014)
3.షిల్లాంగ్, మేఘాలయ(2011)
4.కొట్టాయం, కేరళ(2019)
5.మణిపూర్(2022)