Dream House to Move | పంజాబ్లోని ఓ రైతు అతడు. రూ.1.5 కోట్ల ఖర్చుతో కలల సౌధం.. అంటే డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నాడు. కానీ సమాజ హితం కోసం ఆ ఇంటిని అక్కడి నుంచి 500 అడుగుల దూరం జరిపేందుకు సాహసించాడు.. అవును ఇది నిజం.. ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వే రూట్లో ఈ ఇల్లు వస్తోంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తయితే హర్యానా, పంజాబ్, జమ్ముకశ్మీర్ మధ్య ప్రయాణించే వారికి దూరాభారం తగ్గుతుంది. భారత్ మాల ప్రాజెక్టు కింద కేంద్రం ఈ ఎక్స్ప్రెస్వే చేపట్టింది. సమాజ హితం కోసం నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే కోసం దారి మధ్యలో వచ్చిన తన ఇంటిని కూల్చేయడానికి ఆ అన్నదాత ససేమిరా అన్నాడు. కట్టిన ప్రాంతం నుంచి 500 అడుగుల దూరం తరలించేందుకు సిద్ధం అన్నాడు.
ఆ అన్నదాత పేరు సుఖ్విందర్ సింగ్ సుఖి. సంగ్రూర్లోని రోషన్వాలాలో గల పంట పొలంలోనే తన కలల సౌధం తీర్చిదిద్ది మరీ అన్ని హంగులతో కట్టుకున్నాడు. కానీ, ఎక్స్ప్రెస్ వే కోసం ఆ ఇంటిని కూల్చేస్తే తగినంత నష్ట పరిహారం చెల్లించడానికి పంజాబ్ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఆ సుఖ్విందర్ సింగ్ ఒప్పుకోలేదు. కూల్చేయడానికి బదులు మరో ప్రదేశానికి జరిపేందుకే సిద్దమయ్యాడు. రైతులు, కొందరు భవన నిర్మాణ కార్మికుల సాయంతో ఇప్పటికే 250 అడుగుల దూరం ముందుకు జరిపాడు.
కొన్ని గేర్లు, చక్రాలు కలగలిపిన ఆ ఇల్లు తరలి వెళుతున్న దృశ్యాల వీడియో చూపరులను ఆకట్టుకుంటున్నది. `ఈ ఇల్లు నిర్మాణానికి రెండేండ్లలో రూ.1.5 కోట్లు ఖర్చు చేశా. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను మరో ఇల్లు నిర్మించాలని కోరుకోవట్లేదు` అని సుఖ్విందర్ సింగ్ చెప్పాడు. `ఢిల్లీ-అమృత్సర్-కత్రా నేషనల్ హైవే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అది పూర్తయితే ఢిల్లీ నుంచి పంజాబ్ మీదుగా జమ్ముకశ్మీర్ వరకు వెళ్లే ప్రయాణికులకు టైం, మనీ, శక్తి ఆదా అవుతుంది` అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గత నెలలో చెప్పారు.