LJP : ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐదు లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఆ ఐదు స్థానాలకు ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ వర్గం చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అభ్యర్థులను ఖరారు చేశారు.
చిరాగ్ పాశ్వాన్ తన సిట్టింగ్ స్థానమైన హజీపూర్ నుంచి బరిలో దిగనున్నారు. అదేవిధంగా అరుణ్ బార్తి ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ స్థానమైన జాముయ్ నుంచి, రాజేశ్ వర్మ ఖగారియా లోక్‌సభ స్థానం నుంచి, శాంభవి చౌధరి మరో ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ స్థానం సమస్తిపూర్ నుంచి, వీణాదేవి వైశాలి లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడనున్నారు.
ఎన్డీఏ కూటిమితో పొత్తులో భాగంగా బీహార్‌లో ఎల్జేపీకి ఐదు లోక్‌సభ స్థానాలు దక్కాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్జేపీ ఐదు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అయితే చిరాగ్ పాశ్వాన్ చిన్నాన్న పశుపతి పరాస్ పార్టీని చీల్చి ఎన్డీఏతో జట్టు కట్టడంతో చిరాగ్ ఒక్కరే పార్టీ తరఫున ఎంపీగా మిగిలారు. ఈ క్రమంలో ఈసారి పశుపతి పరాస్‌ను పక్కన పెట్టిన బీజేపీ.. ఎల్జీపీకి ఐదు సీట్లు ఇచ్చింది.