AAP protest : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi LG) వినయ్ కుమార్ సక్సేనా (VK Saxena) కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP workers) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రెటేరియట్ కార్యాలయం బయట ఎల్జీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎల్జీ సక్సేనా తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మయూర్ విహార్ ఏరియాలో తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి తల్లీకొడుకు మృతిచెందిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఎల్జీ రాజీనామా చేయాలని వారు పట్టుబట్టారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఘాజీపూర్ లోనూ రహదారిపై భారీగా వరద నిలిచింది.
అదే సమయంలో తనూజ బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల కొడుకు ప్రియాంష్‌ను తీసుకుని కూరగాయల కోసం ఘాజీపూర్‌లోని వారాంతపు సంతకు వెళ్లింది. సంతలో సరుకులు తీసుకొని తిరిగి వచ్చేటప్పటికి రోడ్డుపై భారీగా వరద చేరింది. వరద నీరు పోయేందుకు రోడ్డుపై మ్యాన్ హోల్ తెరుచిపెట్టడంతో అది గమనించని మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా అందులో పడిపోయింది.
ఘటనా ప్రాంతానికి అర కిలోమీటర్ దూరంలో తల్లీకొడుకు మృతదేహాలు దొరికాయి. మరణించి కూడా ఆ తల్లి తన కొడుకును బిగ్గరగా పట్టుకునే ఉంది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. గత మూడు నెలలుగా ఆ మ్యాన్‌హోల్ తెరిచే ఉందని, పలుమార్లు అధికారులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రెండు నిండు ప్రాణాలు తీసిందని మండిపడుతున్నారు.