Civils students death : సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది. ఘటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్.. ఘటనా ప్రాంతానికి వెళ్లారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతిమాలివాల్‌పై మండిపడ్డారు. విషయాన్ని రాజకీయం చేయవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. అయితే కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో.. మిగతా విద్యార్థులు స్వాతిమాలివాల్ ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది.
#WATCH | Delhi: AAP MP Swati Maliwal at the spot in Old Rajender Nagar where the students are protesting.
The students protest against her and raise “Swati go back” slogan. pic.twitter.com/RUsqptpvyw
— ANI (@ANI) July 28, 2024
కాగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోగల రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు చేరింది. దాంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7.15 గంటలకు సమాచారం వచ్చిందని, వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు.
అప్పటికే సెల్లార్ మొత్తం నీటితో నిండి ఉందని, ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. కాగా ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవీన్ డాల్విన్ (28) గా గుర్తించామని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ.. సీఎస్ నరేష్‌కుమార్‌ను ఆదేశించారు.