CDS Anil Chauhan : మాటలతో యుద్ధాలు గెలువలేమని, యుద్ధాలు గెలువడానికి మాటలు పనికిరావని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) పాకిస్థాన్ (Pakistan) కు చురకలు వేశారు. స్పష్టమైన చర్యలతో మాత్రమే విజయం సాధ్యమని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో సీడీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ప్రణాళిక, వేగంగా కచ్చితమైన నిర్ణయాలను అమలుచేయడం ద్వారా అసలైన దృఢత్వం లభిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ తామే విజయం సాధించామంటూ ఆ దేశం ప్రకటనలు చేసుకుంటోందని విమర్శించారు. బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని, దానివల్ల తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు కనిపిస్తుంటాయని దాయాది దేశానికి కౌంటరిచ్చారు.
భారతదేశానికి స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నదని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు భారత్‌కు బలమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయని అన్నారు. కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అలాగే దేశ సేవకు తమ పిల్లలను అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
దుందిగల్ అకాడమీలో క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ అందిందని సీడీఎస్ అన్నారు. విధిలో నిర్లక్ష్యం పనికిరాదని, ఎవరు చేసే తప్పులకు వారే బాధ్యులు అవుతారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు.