New Rules | న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వార పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం కొత్త చట్టం కోసం రూల్స్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు కోర్టు నుంచి సమన్లు, వారెంట్లు ఈ-మెయిల్ ద్వారా సమన్లు, వారెంట్ జారీ చేసినట్లుగానే పరిగణించనున్నారు.
అయితే, ఈ-మెయిల్, ఫోన్ నంబర్లు, మెసేజింగ్ అప్లికేషన్స్ ఉపయోగించని వారికి మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. అలాంటి సందర్భాల్లో సాంప్రదాయ పద్ధతిలో అవలంభించనున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ సిబ్బంది సమన్లు, వారెంట్లను అందించనున్నారు. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ చర్య న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తుందని.. డిజిటల్ యుగంలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన అడుగని ప్రభుత్వం పేర్కొంది. కొత్త రూల్ అమలుతో న్యాయ ప్రక్రియలో సమయం, వనరులు ఆదాయ అవుతాయని.. అలాగే, కోర్టు ఉత్తర్వులు మరింత సమర్థవంతంగా అమలు చేయబడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.