కోల్కతా: దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదంపై ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థను 2026 నాటికి అభివృద్ధి చేయనున్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించింది. ప్రయోగాత్మకంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, కలింపాంగ్, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాల మ్యాపింగ్ చేసినట్టు తెలిపారు. దేశంలో 19 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ముప్పు ఉన్నదని, ఇది దేశం మొత్తం భూభాగంలో 12.6 శాతమని చెప్పారు.