Manoj Naravane | పుణే, మే 12 : యుద్ధం రొమాంటిక్‌గా ఉండదని.. అదేం బాలీవుడ్ సినిమా కాదని భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొంత మంది చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధానికన్నా దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తెలివైన వ్యక్తి వాస్తవాలు, లెక్కలను బేరీజు వేసుకుంటాడని.. యుద్ధానికి అయ్యే ఖర్చు, నివారించలేని నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, పాక్ ఆర్మీ వైమానిక స్థావరాలపై మన ఆర్మీ దాడి చేయడం ద్వారా యుద్ధంతో జరిగే నష్టాన్ని పాకిస్థాన్‌కు భారత్ స్పష్టంగా తెలియజేసిందని వివరించారు. ఈ పరిణామాలతోనే పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ వైపు మొగ్గు చూపారని చెప్పారు.