Waqf Law | దేశంలో వక్ఫ్ సవరణ చట్టం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతవారం పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయం ప్రకటించలేదు. అయితే, నేటి నుంచి (ఏప్రిల్ 8) నుంచి వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చిందని నోటిఫికేషన్లో పేర్కొంది. కేంద్రం పంపిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా, లోక్‌సభ సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3న బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సబలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
అయితే, 1995 చట్టం ప్రకారం.. వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఓ వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఒకటి ప్రకటన ద్వారా, దీర్ఘకాల వినియోగం ఆధారంగా (వక్ఫ్ బై యూజర్), వారసత్వం అంతరించినప్పుడు (వక్ఫ్-అలల్-ఔలాద్) ఏర్పడుతుంది. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే, వాటిని వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉంటుంది. సర్వే కమిషనర్ ఆస్తుల సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయి. వాటి నిర్ణయాలు అంతిమంగా పరిగణిస్తారు. చట్టం ప్రకారం, వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాల్సి ఉంటుంది. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం తదితర సమస్యలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను సైతం వక్ఫ్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.
కొత్త తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు. వక్ఫ్-అలల్-ఔలాద్‌లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్‌కు ఇచ్చారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిం కాని సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండబోదు.