ముంబై: మహారాష్ట్రలోని షిరిడీ లోక్సభ స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నానని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే (Ramdas Athawale) తెలిపారు. కొన్ని పొత్తుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. అయితే తాను ఎన్డీయేతోనే ఉండాలని, కేంద్ర మంత్రి పదవి కోరాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రముఖ దళిత నేత అయిన రాందాస్ అథావాలే ఈ మేరకు మీడియాతో బుధవారం మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడైన తాను ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినట్లు తెలిపారు. షిరిడీ స్థానం నుంచి పోటీ కోసం ప్రయత్నించినట్లు చెప్పారు.
కాగా, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సిట్టింగ్ ఎంపీ సదాశివ లోఖండేకు ఆ సీటు కేటాయించారని రాందాస్ అథావాలే తెలిపారు. అందుకే సీట్ల పంపకం కుదరలేదని చెప్పారు. అయితే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్న కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మవద్దని అథావాలే అన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే తాను రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.