ముంబై: భారతీయ శాస్త్రవేత్తలు రాబందుల(Indian Vulture)పై చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. పంజరంలో పెరిగిన పక్షులు కూడా .. వన్య వాతావరణాన్ని తట్టుకోగలవని నిరూపితమైనట్లు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిషోర్ రిథే తెలిపారు. తాము విడిచిపెట్టిన ఓ రాబందు పక్షి సుమారు 3334 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు. నిర్భంధ శిక్షణలో పెరిగిన రాబందులను .. మహారాష్ట్రలోని మేల్ఘాట్ నుంచి జనవరిలో వదిలేశారు. అయితే ఆ పక్షులు ఇటీవల రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆ రాబందులు సుమారు 3వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్లు కిషోర్ తెలిపారు. రాబందుల సంరక్షణ ప్రోగ్రామ్‌లో కీలక మైలురాయి అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా దేశంలో రాబందుల సంఖ్యను పెంచవచ్చు అని తెలిసిందన్నారు.
రాబందులు తమ ప్రయాణంలో భాగంగా సత్పురా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్‌లోని కూనో రిజర్వ్ ఫారెస్ట్‌లో కూడా సంచరించినట్లు తెలిసింది. చివరకు అవి రణ్‌తంబోర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకున్నాయి. ఎక్స్67 అనే అయిదేళ్ల ఆడ రాబందు పక్షికి సోలార్ పవర్ ట్రాకింగ్ ట్యాగ్‌ను తొడిగి జనవరి రెండో తేదీన వదిలేశారు. మేల్ఘాట్ టైగర్ రిజర్వ్‌లోని అకోట్ వైల్డ్‌లైఫ్ డివిజన్లో ఉన్న సోమ్థాన రేంజ్ నుంచి దాన్ని విడిచిపెట్టారు. ఆహారం కోసం అది మూడు రాష్ట్రాల్లో తిరిగినట్లు గుర్తించారు. అయితే తొలి నాలుగు నెలలు మేల్‌ఘాట్‌లో ఉన్న ఆ పక్షి ఆ తర్వాత.. సెంట్రల్ ఇండియా దిశగా వెళ్లింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సంచరించింది. ఆ వల్చర్ పక్షి 3334 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు బీఎన్హెచ్ఎస్ తన ప్రకటనలో చెప్పింది.
భూపాల్ ప్రాంతంలో సత్పురా నేషనల్ పార్క్, కూనో నేషనల్ పార్క్ ప్రాంతంలో సుమారు 27 రోజుల పాటు ఆ పక్షి సంచరించింది. అయితే ఆ పక్షి ప్రయాణించిన మార్గాలన్నీ.. టైగర్ రిజర్వ్ ప్రాంతాలని కిశోర్ రిథే తెలిపారు. బ్లూ కలర్లో ఉన్న ట్యాగ్‌లను 15 రాబందులకు తొడిగి వాటిని రిలీజ్ చేశారు. సోలార్ పవర్‌తో నడిచే ట్యాగ్స్ వల్ల ఆ పక్షుల ఎటు వెళ్తున్నాయో శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు.