చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయండి, ఆప్‌కు వద్దు’ అంటూ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ‘ఆప్‌కి ఓటేస్తే ఉగ్రవాదానికి వేసినట్లే. పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి వేసిన ఓటే. ఆప్‌కి ఓటేస్తే దేశానికి, పంజాబ్‌కు ద్రోహం చేసినట్లే. ఒకవేళ మాకు (బీజేపీ) ఓటు వేయకూడదనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి. దేశానికి ద్రోహం చేసే వారికి (ఆప్‌కు) మాత్రం ఓటు వేయవద్దు’ అని ప్రజలనుద్దేశించి అశ్వనీ శర్మ అన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ దీనిపై స్పందించారు. తన మాటలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. అసత్యాలను ప్రచారం చేయడం కాంగ్రెస్ పాత ఎత్తుగడ అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే తన మాటలను ఆ మేరకు వక్రీకరించారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, ఆప్ రెండూ కూడా పంజాబ్‌కు మేలు చేయవని అశ్వనీ శర్మ అన్నారు. ఆ రెండు పార్టీలు పంజాబ్‌కు ప్రమాదకరమని విమర్శించారు. ‘బీజేపీ కోసం కమలం బటన్‌ను నొక్కండి. తద్వారా రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు.