Vontimitta Priests : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా పులివెందులలో మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం అందించినందుకుగాను ఆ ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ అర్చకులు ప్రొటోకాల్ ఉల్లంఘించారని విమర్శించింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం టీటీడీ పరిధిలో ఉన్నది. ఈ ఆలయంలో పనిచేసే ముగ్గురు అర్చకులు ఇతర అర్చకులతో కలిసి జగన నివాసంలో ఆయనకు వేదాశీర్వచనం అందించారు. వారు ఇలా ప్రొటోకాల్‌ను అతిక్రమించడంపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. వ్యక్తిగత హోదాలో రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లి ఆలయ మర్యాదలను పాటించకపోవడం సరికాదని మండిపడింది. సదరు అర్చకులపై చర్యలకు ఉపక్రమించింది.
తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రెండు రోజుల్లోగా వివరణ సమర్పించాలని అర్చకులను టీటీడీ ఆదేశించింది. వారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆలయ పవిత్రత, నియమ నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ వర్గాలు స్పష్టంచేశాయి. అయితే ఈ నోటీసులపై అర్చకుల నుంచి ఎలాంటి స్పందన లేదు.