న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. ఈ దశాబ్దం చివరినాటికి లక్షమందిని ఇంటికి పంపించడానికి రంగం సిద్ధమయ్యింది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య గురువారం ఒప్పందం జరిగినట్టు ఆడీ, పోర్షే లాంటి 10 బ్రాండ్ల సమూహం కలిగి ఉన్న ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది.
సంస్థ నుంచి 50 వేల మందిని తొలగించడానికి ఇప్పటికే ఒప్పందం జరుగగా, తాజాగా మరో 50 వేల మంది లేఆఫ్‌నకు సంబంధించిన ఒక ప్రణాళిక ఆమోదం పొందినట్టు తెలిపింది. ‘ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని తీర్చిదిద్దడం కోసం ఈ నిర్ణయం తప్పనిసరి’ అని సంస్థ ప్రకటించింది. యూఎస్ టారిఫ్‌లు, ఎలక్ట్రిక్ కార్లకు అస్థిరమైన డిమాండ్, చైనా, ఇతర దేశాల నుంచి వస్తున్న పోటీ తదితర కారణాల వల్ల సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. లక్ష మంది తొలగింపు అంటే ప్రపంచంలోని కారు తయారీ సిబ్బందిలో 15 శాతమని వాహనరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో 2009లో జనరల్ మోటర్స్ దివాలా తీసినప్పుడు 50 వేల మంది ఉద్యోగులను తొలగించింది.