Vladimir Putin : రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ డిసెంబర్లో భారత్లో పర్యటించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5-6 తేదీల్లో భారత్కు రానున్నారు. సుంకాల (Tariffs) తో అమెరికా విరుచుకుపడుతున్న వేళ, భారత్-రష్యా (Russia) సంబంధాలు మరింత బలోపేతమవుతున్న క్రమంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్లో పుతిన్ పర్యటన ఉంటుందని జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ గత నెలలో మాస్కో పర్యటన సందర్భంగా ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఆ పర్యటనను ధ్రువీకరించారు. కానీ తేదీలు వెల్లడించలేదు. అయితే డిసెంబర్ 5, 6 తేదీల్లో పర్యటన ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని మోదీ, పుతిన్ గత ఏడాది రెండుసార్లు భేటీ అయ్యారు. జూలైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని రష్యాకు వెళ్లారు. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో మరోసారి వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్-మోదీలు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.