భువనేశ్వర్: ఒడిశా ప్రజలు తనను క్షమించాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కీలక అనుచరుడు వీకే పాండియన్ (VK Pandian) అన్నారు. నవీన్ పట్నాయక్‌ను శాసిస్తున్నట్లుగా, ఆయన రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగడం, ఎన్నికల్లో బీజేడీ ఓటమి నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఒక వీడియో సందేశాన్ని పాండియన్ విడుదల చేశారు. చిన్న పల్లెకు చెందిన అతి సామాన్య కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. ఐఏఎస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది తన చిన్ననాటి కోరిక అని చెప్పారు. భగవంతుడైన జగన్నాథుడు దానిని సాకారం చేశారని అన్నారు.
కాగా, తన కుటుంబం మూలాలు కేంద్రపారాకు చెందినవి కావడంతో తమిళనాడు నుంచి ఒడిశాకు తాను వచ్చినట్లు వీకే పాండియన్ తెలిపారు. ఒడిశా గడ్డపై అడుగు పెట్టిన తొలి రోజు నుంచే అపారమైన ప్రజల ప్రేమ, గౌరవం తనకు లభించాయని చెప్పారు. ప్రజల కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని అన్నారు. తనకున్న ఏకైక ఆస్తి తన పూర్వికుల నుంచి సంక్రమించినదని వివరించారు. ‘ఈ జీవితకాలంలో నేను సంపాదించిన అతిపెద్ద సంపాదన ఒడిశా ప్రజల ప్రేమ, ఆప్యాయత వారి ఆదరాభిమానాలు’ అని అన్నారు.
మరోవైపు 12 ఏళ్ల కిందట ప్రభుత్వ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తాను తన గురువైన నవీన్ పట్నాయక్‌కు సహాయం చేసేందుకే బీజేడీలో చేరినట్లు వీకే పాండియన్ తెలిపారు. ఇదే తన ఏకైక ఉద్దేశమని, నిర్దిష్ట రాజకీయ పదవి లేదా అధికారం కోసం తనకు ఎలాంటి కోరిక లేదని చెప్పారు. తాను రాజకీయ అభ్యర్థిని కాదన్న ఆయన, బీజేడీలో ఏ పదవిని నిర్వహించలేదని వెల్లడించారు. ‘కొన్ని అవగాహనలు, కథనాలను సూటిగా సెట్ చేయాలనుకుంటున్నా. బహుశా ఈ రాజకీయ కథనాలను సరైన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే నా లోటు’ అని అన్నారు.
కాగా, రాజకీయాల్లో చేరాలనే తన ఉద్దేశం కేవలం నవీన్‌బాబుకు సహాయం చేయడం కోసమేనని వీకే పాండియన్ స్పష్టం చేశారు. ‘ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. నాపై జరిగిన ప్రచారం వల్ల బీజేడీకి నష్టం జరిగి ఉంటే క్షమించండి’ అని అన్నారు. ఒడిశాను ఎప్పుడూ తన హృదయంలో ఉంచుకుంటానని, గురువు నవీన్‌బాబును తన శ్వాసలో ఉంచుకుంటానని పాండియన్ తెలిపారు. ఒడిశా, నవీన్ పట్నాయక్ శ్రేయస్సు కోసం జగన్నాథుడిని ప్రార్థిస్తానని ఆయన అన్నారు.
#WATCH | 5T Chairman & BJD leader VK Pandian says, "…Now consciously I decide to withdraw myself from active politics. I am sorry if I have hurt anyone on this journey. I am sorry if this campaign narrative against me has had a part to play in BJD's loss…"
(Source: BJD) pic.twitter.com/Hf1stid8Gn
— ANI (@ANI) June 9, 2024