Parasakthi | శివకార్తికేయన్ నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) సెన్సార్ క్లియరెన్స్ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ నటించిన ‘జననాయగన్’ మాదిరిగానే ఈ సినిమా కూడా సెన్సార్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతుందా అనే వార్తలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. శివకార్తికేయన్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా సెన్సార్ సర్టిఫికేట్ దగ్గర ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూసుకుంటే.
1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందినట్లు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారే అవకాశం ఉండటంతో, సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా జనవరి 10న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే ఇవాళ (జనవరి 8) వరకు సర్టిఫికేట్ అందకపోవడంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకవేళ రేపటిలోగా క్లియరెన్స్ రాకపోతే మేకర్స్ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ ఇప్పటికే సెన్సార్ సమస్యలతో న్యాయపోరాటం చేస్తోంది. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమా కూడా అదే పరిస్థితులను ఎదుర్కోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వారం ముందే బుకింగ్స్ షురూ అవుతాయి. కానీ సెన్సార్ రిపోర్ట్ లేకపోవడంతో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ‘జననాయగన్’ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఉంటే, ‘పరాశక్తి’ సినిమా ద్రవిడ ఉద్యమ మూలాలను స్పృశిస్తోంది. ఈ రెండు సినిమాలు రాజకీయంగా ప్రాధాన్యత ఉన్నవి కావడంతోనే సెన్సార్ ప్రక్రియ ఆలస్యమవుతోందని టాక్.