Pahadi Dal | మన దేశంలో ప్రాంతానికి ఒక వంటకం ప్రసిద్ది చెంది ఉంటుంది. అలాంటి వాటిల్లో పహాడీ దాల్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎక్కువగా తయారు చేసే ఒక క్లాసిక్ కంఫర్ట్ మీల్ ఈ పహాడీ దాల్. ఈ వంటకం పహాడీ స్టైల్ లో చేసే సాధారణ దాల్ చావల్ అని చెప్పవచ్చు. దీనిని మినుములు, సుగంధ ద్రవ్యాలు, మూలికల మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ దాల్ ను అన్నంతో వడ్డిస్తారు. దీనిని భట్ అని పిలుస్తారు. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పహాడీ భట్ చేయడానికి ఉపయోగించే మినుముల్లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఈ మినుములను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు గురించి అలాగే దీనిలో ఉండే పోషకాల గురించి పోషకాహార వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
మినుముల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్క ఆధారిత ప్రోటీన్. కండరాల మరమ్మత్తుకు, శరీర పెరుగుదలకు, శరీరం మొత్తం పనితీరుకు ప్రోటీన్ చాలా అవసరం. మినుములను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. అలాగే వీటిలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అదేవిధంగా ఈ మినుముల్లో ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, బి విటమిన్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మినుముల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే మినుముల కొవ్వు తక్కువగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇక మినుములను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మినుములను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. మధుమేహంతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మినుములు మనకు సహాయపడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఎముకల బలాన్ని, సాంద్రతను పెంచడంలో దోహదపడతాయి. మినుములను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగు కదలికలను పెంచడంలో, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తలెత్తకుండా ఉంటుంది. ఈవిధంగా మినుములు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో తరచూ చేసే వంటకాలే కాకుండా ఇలా వెరైటీగా పహాడీ దాల్ వంటి వంటకాలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.