Spain | న్యూఢిల్లీ, మే 19: రాత్రిపూట ఆకాశం ప్రకాశవంతంగా మారడాన్ని ఎప్పుడైనా చూశారా? స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో శనివారం రాత్రి ఆ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది. తీక్షణమైన నీలి రంగు కాంతితో చీకటిని చీల్చుకుంటూ ఓ భారీ ఉల్క భూమిపైకి దూసుకొచ్చింది. ఆ కాంతి తీవ్రత రాత్రిని పగలులా మార్చింది. ఆ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించినట్టు తెలుస్తున్నది.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ప్రజలంతా జీవితకాల అనుభూతిని పొందారు. ఎంతో అరుదైన ఆ అద్భుత దృశ్యాన్ని తమ కెమెరాల ద్వారా వివిధ కోణాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలన్నీ వైరల్గా మారాయి. చివరికి ఆ ఉల్క భూమిపై పడిందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పటివరకూ ఎవరూ నిర్ధారించలేదు. కానీ, అది పోర్చుగల్లోని క్యాస్ట్రో డైర్ పట్టణం సమీపంలో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.