Viral news : తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఓ యువతి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేశారు. CT స్కాన్ రిపోర్టు చూసి వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే ఆమె పొట్టలో ఏదో నల్లగా ఉన్నట్టు గుర్తించారు. దాంతో వైద్యులు ఆపరేషన్ చేసి చూడగా కుప్పలు కుప్పలుగా జుట్టు ఉన్నది. ఆ జుట్టును తొలగించిన వైద్యులు దాన్ని తూచి చూడగా ఏకంగా రెండు కిలోల బరువు తూగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఓ 21 ఏళ్ల యువతి ఇటీవల కడుపునొప్పితో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. యువతి పొట్టలో నుంచి డాక్టర్లు రెండు కిలోల జుట్టును తొలగించారు. పదహారేళ్లుగా ఆమె తన జుట్టును తానే పీక్కు తింటోందని గుర్తంచారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రికోఫేగియా లేదా రపంజెల్ సిండ్రోమ్గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు.
‘ట్రికోఫేగియా అనేది దీర్ఘకాలిక మానసిక రుగ్మత. ఈ సమస్యతో బాధపడేవారు తమ జుట్టును తామే పీకేసి తినేస్తుంటారు’ అని సర్జరీ చేసిన డాక్టర్ ఎంపీ సింగ్ వివరించారు. ఆ యువతి ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా తన జుట్టును తానే తినేస్తోందన్నారు. ఆమెకు సెప్టెంబర్ 26న శస్త్రచికిత్స నిర్వహించి రెండు కేజీల హెయిర్బాల్ను తొలగించామని చెప్పారు. ఆపరేషన్ అనంతరం బాధితురాలి ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆమె తన మానసిక రుగ్మతకు ఆస్పత్రిలోనే కౌన్సిలింగ్ తీసుకుంటోంది.