Viral news : భారత న్యాయవ్యవస్థ (Indian Judiciary) లో నెలకొన్న జాప్యానికి అద్దంపట్టే ఘటన ఒకటి బీహార్ (Bihar) లో చోటుచేసుకుంది. 33 ఏళ్ల క్రితం నమోదైన ఓ హత్యాయత్నం కేసులో 84 ఏళ్ల వృద్ధుడిని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ సుదీర్ఘ విచారణ, తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. 1992 నవంబర్ 10న బీహార్ (Bihar) లోని వైశాలి జిల్లా (Vaishali district) రాఘవ్‌పూర్ గ్రామంలో దీప్ రాయ్ (Deep rai) అనే వ్యక్తి, అతని అనుచరులు కలిసి అదాలత్ రాయ్ (Adalat Rai) అనే వ్యక్తి ఇంటి ముందు పగిలిన గాజు ముక్కలు పడేశారు.
దీనిపై అదాలత్ రాయ్, ఆయన భార్య ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఆయుధాలు, తుపాకులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాంతో దీప్‌రాయ్, అతని నలుగురు అనుచరులపై అదాలత్ రాయ్ హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కేసులో 1993 మార్చిలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా.. 1999లో అభియోగాలు నమోదు చేశారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఈ విచారణలో 10 మంది సాక్షులను విచారించారు. ఇంతలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మరణించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దీప్‌రాయ్ (84) మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు.
ఈ క్రమంలో హాజీపూర్‌లోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 147, 148, 307 కింద దీప్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. కోర్టు దోషిగా తీర్పు చెప్పిన అనంతరం.. ఇద్దరు వ్యక్తుల సహాయంతో బలహీనంగా నడుస్తున్న దీప్ రాయ్‌ను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం దీప్‌రాయ్ వంగి నడుస్తున్నఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ చిన్న గొడవకు సంబంధించిన కేసులో తీర్పు వెలువడటానికి 33 ఏళ్లు పట్టడం న్యాయవ్యవస్థ పనితీరుపై మరోసారి చర్చకు తెరలేపింది.
बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026