చెన్నై, జూలై 17: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బాధిత బంధువులు, వారి గ్రామస్థులు దాదాపు 2 వేల మంది పాఠశాలను ముట్టడించారు. విద్యార్థిని మృతికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు 13 పాఠశాల బస్సులతో పాటు మూడు పోలీసు వాహనాలకు కూడా నిప్పంటించారు. పాఠశాల భవనంలోకి దూసుకెళ్లి క్లాస్‌రూమ్‌లు, ప్రిన్సిపాల్ గది, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇంటర్ చదువుతున్న ఓ బాలిక ఈనెల 13న హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నది. తక్కువ మార్కులు వచ్చాయని టీచర్లు దారుణంగా వ్యవహరించారని సూసైట్ నోట్లో పేర్కొన్నది.