న్యూఢిల్లీ: ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వల్పంగా బరువు ఎక్కువ ఉండటంతో రెజ్లింగ్‌లో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫోగాట్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. వచ్చే నెలలో హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన కజిన్, కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ పతకధారి అయిన బబితా ఫోగాట్‌పై పోటీ చేయవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు వినేశ్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, స్వరాష్ట్రమైన హర్యానా నుంచి ఆమెను పోటీకి దింపాలని కొన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వినేశ్‌ను ఎంపీ దీపీందర్ హుడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతున్నది.
దీంతో తన పెద్దనాన్న కుమార్తె అయిన బబితా ఫోగాట్‌పై ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. కాగా, బబితా ఫోగాట్ బీజేపీలో చేరి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాద్రి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.