బెంగళూరు, ఆగస్టు 17: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ విజయవంతంగా వేరు అయినట్టు ఇస్రో గురువారం వెల్లడించింది. ఈ నెల 18న డీఆర్బిట్-1, 20న డీఆర్బిట్-2 ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియలతో ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపడుతారు. ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక 90 డిగ్రీలుగా ఉన్నది. దాన్ని పూర్తిగా నిలువుగా మారుస్తారు. ఈ ప్రక్రియే అత్యంత కఠినమైనదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల తెలిపారు.
ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలోనే ప్రయాణం కొనసాగించనున్నది. ఇది ఇక్కడే ఏండ్ల పాటు ఉంటూ ఇస్రోకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఇందులో ఉండే షేప్ (స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హెబిటబుల్ ప్లానెట్ ఎర్త్) పే లోడ్ భూ వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. మేఘాల కాంతి ధ్రువణాలపై అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తుంది.
చంద్రయాన్-3 ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం అవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విఫలమైన చంద్రయాన్-2లో లేని కొన్ని ప్రత్యేకతలను చంద్రయాన్-3లో పొందు పరిచినట్టు ఆయన వివరించారు. ‘రిటార్డేషన్ ప్రక్రియలో ల్యాండర్ వేగాన్ని తగ్గించాల్సిన ఐదు థ్రస్టర్ ఇంజిన్లు అనుకున్న దాని కంటే అధిక వేగాన్ని అందుకున్నాయి. అదే సమయంలో ల్యాండింగ్ కోసం 500X500 చ.మీ ప్రాంతాన్నే ల్యాండింగ్‌కు కేటాయించారు. ఇది చాలా తక్కువ ప్రాంతం కావడంతో ల్యాండర్ అధిక వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని విఫలమైంది. చంద్రయాన్-2లో సక్సెస్ బేస్డ్ డిజైన్‌ను వినియోగించారు. అందుకు భిన్నంగా చంద్రయాన్-3లో వైఫల్యాల ఆధారిత డిజైన్‌ను రూపొందించాం. ఎటువంటి ప్రక్రియ విఫలమైనప్పటికీ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా దానిలో అనేక సెన్సార్లను అమర్చాం. మరోవైపు ల్యాండింగ్ ప్రాంతాన్ని 4X2.5 కి.మీ పెంచాం.
అక్కడి పరిస్థితులను బట్టి ఈ ప్రాంతంలో ఎక్కడైనా ల్యాండింగ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేశాం. 30 సెం.మీ మించి పెద్ద వస్తువు ఏదైనా ఆ ప్రాంతంలో ఉంటే తనంతట తానుగా ల్యాండింగ్ సైట్‌ను మార్చుకునే టెక్నాలజీ అందులో ఉంది. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో చివరి నిమిషంలో ల్యాండింగ్ ప్రదేశాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్టుగా… దీనికి చివరి నిమిషంలో లెక్కల గజిబిజి అవసరం పడదు. పవర్ కోసం సోలార్ ప్యానెల్లను అమర్చాం. నిలువుగా ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ల్యాండింగ్ వేగాన్ని సెకనుకు 2 మీటర్ల నుంచి 3 మీటర్లకు పెంచాం. హెలీకాఫ్టర్, క్రేన్ల సాయంతో ఎత్తులో నుంచి వేగంగా కిందపడినా ల్యాండర్‌కు ఏమీ కాకుండా ఉండేలా అన్ని రకాలుగా పరీక్షించాం’ అని తెలిపారు.