TVK chief : కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు (TVK party chief) విజయ్ ఆదివారం (రేపు) కలవనున్నట్లు సమాచారం. అయితే బాధిత కుటుంబాల ఇంటింటికి వెళ్లి కాకుండా అందరినీ ఒక ప్రత్యేక వేదికపై విజయ్ కలువనున్నట్లు టీవీకే పార్టీ ప్రకటించింది. ధర్మపురి జిల్లా (Dharmapuri district) లో ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.
విజయ్ తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాల సభ్యులతో మాట్లాడి పరామర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్పనున్నారు. కాగా కరూర్‌లో సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి జనం ఊహించని రీతిలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
అయితే విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసింది. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వేదిక నుంచి ఒక కిలోమీటరు మేర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి. కేవలం బాధిత కుటుంబాలకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని వారు తెలిపారు.