TVK : నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK)’ పార్టీని బలవంతంగా ఎన్డీఏలో చేర్చుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన నటించిన ‘జన నాయగన్ (Jana Nayagan)’ చిత్రానికి సకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా కేంద్రం (Union govt) అడ్డుపడుతున్నదని ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీవీకే స్పందించింది. రాజకీయంగా తమను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్డీఏతో జట్టు కట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పష్టంచేశారు. టీవీకేను కూల్చడానికి ఎన్ని కుట్రలు పన్నినా తమ పార్టీ సిద్ధాంత వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. టీవీకేకు బీజేపీ సిద్ధాంత శత్రువు అయితే, డీఎంకే రాజకీయ శత్రువు అని పేర్కొన్నారు.
‘జన నాయగన్’ సినిమా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ స్పందనను స్వాగతిస్తున్నట్లు నిర్మల్ కుమార్ తెలిపారు. దీనిని తమ పార్టీకి కాంగ్రెస్ ఇస్తున్న స్నేహపూర్వక మద్దతుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ పార్టీతో పొత్తు విషయంపై తమ పార్టీ అధినేత విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారన్నారు. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీచేయడం చూస్తుంటే.. ఆయనను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.