చెన్నై: వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు శాససనభ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో కాని, డీఎంకేతో కాని ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తు పెట్టుకోదని తమిళగ వెట్రి కజగం(టీవీకే) శుక్రవారం ప్రకటించింది. తమ పార్టీ సీఎం అభ్యర్థి విజయ్ అని తెలిపింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం డీఎంకే, ఏఐడీఎంకే లాగా రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోం. ఎందుకంటే మేం టీవీకే’ అని ఆ పార్టీ ప్రకటించింది.
డీఎంకే, ఏఐడీఎంకే, బీజేపీ కూటముల్లో లేని పార్టీల కూటమికి తాము నాయకత్వం వహిస్తామని చెప్పింది. చౌకబారు రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు కేంద్రంలోని పాలక పక్షం ప్రయత్నిస్తున్నదని విజయ్.. బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ దుష్ట చర్యలు తమిళనాడులో పనిచేయవని ఆయన అన్నారు. విజయ్ సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడతారని టీవీకే ప్రధాన కార్యదర్శి అనంద్ తెలిపారు.