చెన్నై, మదురై, అక్టోబర్ 3: టీవీకే పార్టీ కరూర్ సభలో తొక్కిసలాట జరిగిన వెంటనే టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అక్కడ నుంచి మాయం కావడం, ఆయనపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టిన మద్రాస్ హైకోర్టు ఘటనను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇదేం రాజకీయ పార్టీ అంటూ టీవీకేని విమర్శించిన జస్టిస్ ఎన్ సెంథిల్‌కుమార్ తొక్కిసలాట మరణాల తర్వాత అక్కడి నుంచి ఆ పార్టీకి చెందిన బాధ్యులందరూ పారిపోయారని, ఎవరూ బాధ్యతను తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి టీవీకే వ్యవహార శైలిని ఖండించారు.
దుర్ఘటన పట్ల టీవీకే కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, ఆ పార్టీ నాయకుడి మానసిక స్థితికి ఇది అద్దం పడుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు సీనియర్ ఐపీఎస్ అధికారి, నార్త్ జోన్ ఐజీ అస్రా గర్గ్ నేతృత్వంలో సిట్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లో విజయ్ పేరును చేర్చనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్ట్ మదురై బెంచ్ శుక్రవారం కొట్టివేసింది. కోర్టును రాజకీయ వేదికగా మార్చవద్దని పిటిషనర్‌ని మందలించింది.