Vijay | తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే పార్టీ రోడ్ షో ఘోర విషాదాన్ని మిగిల్చింది. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఈ సభలో తొక్కిసలాట జరగగా 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన పదివారాల తర్వాత, విజయ్ బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించేందుకు డీజీపీకి లేఖ రాశారు.
కరూర్‌లో నిర్వహించిన రోడ్ షోకు పదివేల మందికే అనుమతి ఉన్నా, లక్ష మందికి పైగా తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో తొక్కిసలాట ఏర్పడి భారీ ప్రాణనష్టం జరిగింది. పరిస్థితి ఘోరంగా మారుతున్న సంగతి గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, జనానికి నీళ్లు పంపించాలని ఆదేశించారు. అయినప్పటికీ, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం, అంబులెన్సులు ఆలస్యం కావడం వల్ల పరిస్థితి అదుపులోకి రాలేదు. వైద్య సహాయం అందించే సమయం లేకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగింది అని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనపై తమిళనాడు వైద్య విద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్. సుగంధి రాజకుమారి నేతృత్వంలోని బృందం కరూర్‌ను సందర్శించి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిని పరిశీలించింది. ప్రాథమిక వైద్య నివేదికల ప్రకారం, చాలా మంది కంప్రెసివ్ అస్ఫిక్సియాతో చనిపోయినట్టు స్పష్టం అయింది.
ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి వల్ల శ్వాస ఆగిపోవడం, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో అతి తక్కువ సమయంలోనే మరణాలు సంభవించినట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నివేదికలు తొక్కిసలాట తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ ఘటనపై తొలుత వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబాలను పరామర్శించిన విజయ్, తాజాగా తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. ఇందులో తాను వ్యక్తిగతంగా బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. తన భార్య, కుమార్తెను ఈ ప్రమాదంలో కోల్పోయిన శక్తివేల్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ..విజయ్ అన్నగారు వీడియో కాల్లో మాట్లాడారు. ఆయన చాలా బాధపడ్డారు. ఈ నష్టం తాను మరచిపోలేనన్నారు. త్వరలో మమ్మల్ని కలుస్తానన్నారు. ఏవైనా అవసరాలు ఉంటే పార్టీ కార్యకర్తల ద్వారా తెలియజేయమన్నారు అని వెల్లడించారు.