లక్నో, ఫిబ్రవరి 20: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోలను కొందరు ఆన్లైన్లో పెట్టడం, పైగా వాటిని అమ్మకానికి ఉంచడం సంచలనం కలిగించింది. 50 కోట్ల మందికి పైగా పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో కొందరు నేరగాళ్లు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటంపై యూపీ అధికారులు అప్రమత్తమయ్యారు.
మహా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన కొన్ని వేదికలను గుర్తించినట్టు యూపీ సామాజిక మాధ్యమ నియంత్రణ బృందం తెలిపింది. అలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అమ్మకానికి పెట్టిన, కొనుగోలు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తామని యూపీ పోలీస్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఈ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టా ఖాతాను గుర్తించేందుకు సహకరించాలని మెటాకు విజ్ఞప్తి చేశామని దీనిపై కోత్వాల్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశామన్నారు.