న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి నిప్పుపెడుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోపాల్ అనే స్థానికుడు మంగ్రోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల పెట్రోల్ పోసి నిప్పుపెడుతున్న దృశ్యాలు ఆ వీడియాలో కనిపించాయి. వెంటనే మంటలు అంటుకోగా అక్కడే ఉన్న ఇతర గ్రామస్థులు మంటలను ఆర్పివేశారు.
వెంటనే గోపాల్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతోసహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందేందుకు తాను అనేకసార్లు పంచాయతీ అధికారులను కలుసుకున్నానని, వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విసిగిపోయి ఈ చర్యకు పాల్పడ్డానని గోపాల్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.