Video call delivery | వీడియో కాల్లో చెప్పిన విధంగా చేస్తూ ఓ గర్భిణీకి కొందరు యువకులు కాన్పు చేసిన సన్నివేశం మనం త్రీ ఇడియట్స్ సినిమాలో చూసి.. వావ్ అనుకున్నాం. అచ్చం అలాంటి సీన్ ఒకటి జమ్ముకశ్మీర్‌లో రిపీట్ అయింది. గైనకాలజిస్ట్ సూచనలతో కేరణ్లో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) సిబ్బంది కాన్పు చేశారు. మంచు కురుస్తున్న సమయంలో మరో పట్టణానికి వెళ్లలేని పరిస్థితుల్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా శనివారం డెలివరీ చేశారు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని కేరణ్ సీహెచ్‌సీకి శుక్రవారం రాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని కుటుంబీకులు తీసుకొచ్చారు. ఆమెను జాయిన్ చేసుకున్న సిబ్బంది.. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దగ్గర్లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, పెద్ద ఎత్తున మంచు కురుస్తుండటంతో బయటి ప్రాంతానికి వెళ్లే దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయి. దాంతో వారు తమకు తెలిసిన క్రాల్పురాకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్‌ను సంప్రదించారు. ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.
అనంతరం వాట్సాప్ వీడియోకాల్‌లో ఆ గైనకాలజిస్ట్ సూచనల మేరకు ఆ సీహెచ్‌సీలోనే డాక్టర్ అర్షద్ సోఫితో కలిసి అక్కడి పారామెడికల్ సిబ్బంది శనివారం ఉదయం ప్రసవం చేశారు. 6 గంటల తర్వాత మహిళ ఆరోగ్యవంతమైన పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. జమ్మకశ్మీర్ కేరణ్ ప్రాంతంలో గత మూడు రోజులుగా భారీ మంచు కురుస్తున్నది. దీంతో చాలా వరకు రోడ్లు మూసుకుపోయాయి. వాహనాలు నడిచేందుకు వీలుగా రోడ్లపై మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి.