CJI | భోపాల్, ఫిబ్రవరి 15: కార్యనిర్వాహక నియామకాల ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) భాగస్వాములయ్యే విధానంపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘మన దేశంలో లేదా ఏదైనా ప్రజాస్వామ్యంలో సీబీఐ డైరెక్టర్ ఎంపిక వంటి కార్యనిర్వాహక నియామకాల ప్రక్రియలో చట్టప్రకారం సీజేఐ ఎలా పాలుపంచుకోగలరు? ఇందుకు హేతుబద్ధత ఏంటి? దీనిని పునఃసమీక్షించాల్సిన సమయం వచ్చింది. కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఇమడదు. కార్యనిర్వాహక నియామకాల ప్రక్రియలో సీజేఐను ఎలా భాగం చేస్తాం?’ అని ధన్కడ్ వ్యాఖ్యానించారు.
ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ధన్కడ్ అభిప్రాయంపై న్యాయనిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ డైరెక్టర్‌తో పాటు ఇతర కార్యనిర్వాహక నియామకాల ఎంపిక కమిటీలో సీజేఐ ఉండొద్దని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. జ్యుడీషియల్ ట్రైబ్యునళ్ల ద్వారా జరిగే నియామకాల్లో మాత్రం సీజేఐ ప్రమేయం ఉండొచ్చని అన్నారు.
అయితే, ఎంపిక ప్రక్రియలో సీజేఐ ఉండటం వల్ల నియామకాలు మెరుగ్గా జరుగుతాయని మరో సీనియర్ న్యాయవాది షోయబ్ ఆలం పేర్కొన్నారు. కార్యనిర్వాహక నియామకాల ప్రక్రియలో సీజేఐ ఉండాలని, తద్వారా ఈ ప్రక్రియ మరింత స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరుగుతుందని న్యాయవాది మోహిత్ మాథుర్ అభిప్రాయపడ్డారు. కాగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సీజేఐను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.