న్యూఢిల్లీ: శబ్ద వేగానికి మించిన వేగంతో మానవుడు ప్రయాణించగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. వీనస్ ఏరోస్పేస్ కంపెనీ నిర్వహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రొటేటింగ్ డిటొనేషన్ రాకెట్ ఇంజిన్ (ఆర్డీఆర్ఈ) అట్మాస్ఫియరిక్ టెస్ట్ విజయవంతమైంది. ఈ పరీక్ష మే 14న న్యూ మెక్సికోలోని స్పేస్‌పోర్ట్ అమెరికాలో జరిగింది. ఈ కంపెనీ సీఈఓ సస్సీ డగ్ల్బై మాట్లాడుతూ, ఐదేళ్ల నుంచి చేస్తున్న కృషి ఫలించిందన్నారు. ఈ ఇంజిన్‌ను హైపర్‌సానిక్ జెట్ స్టార్గేజర్కు ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇది శబ్ద వేగం కన్నా నాలుగు రెట్లు (గంటకు 3,069 మైళ్లు) ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని చెప్పారు. అత్యధిక వేగంతో కూడిన ప్రయాణాలు సాగించే దిశగా ఇది మరో ముందడుగు అని తెలిపారు. దీనిని ప్రజా రవాణాకు ఉపయోగించేందుకు అనుమతి లభిస్తే, న్యూయార్క్ నుంచి 3,625 మైళ్ల దూరంలోని పారిస్‌కు 55 నిమిషాల్లోనే చేరుకోగలదని తెలిపారు. 2030వ దశకం ప్రారంభంలోనే దీనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ.282 కోట్ల విలువైన ఈ స్టార్గేజర్లో ఒకసారి 12 మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
సంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చినపుడు ఆర్డీఆర్ఈల సమర్థత మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ పరిమాణం తక్కువ కావడంతో అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కేవలం కృత్రిమ, నియంత్రిత వాతావరణంలో, ప్రయోగశాలలో మాత్రమే కాకుండా, వాస్తవంగా గగనతలంలో పని చేస్తుందని రుజువు చేశామన్నారు. అత్యధిక బలంతో తోయగలిగే ఆర్డీఆర్ఈని ఆచరణలో సాధ్యం చేయడం కోసం 1980వ దశకం నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు.
వీనస్ కంపెనీ ఆర్డీఆర్ఈని ఇదే కంపెనీకి చెందిన ప్రత్యేకమైన వీడీఆర్2 ఎయిర్బ్రీథింగ్ డిటొనేషన్ రామ్జెట్తో కలిసి పనిచేసే విధంగా తయారు చేశారు. ఇది అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇది అత్యంత వేగంగా ప్రయాణించడం కోసం రొటేటింగ్ డిటొనేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఫలితంగా శబ్ద వేగం కన్నా 5రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది వాతావరణంలోని గాలిని తీసుకుంటుంది. రాకెట్లు అయితే తమ వెంట ఆక్సిజన్‌ను తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇది నెమ్మదిగా మండటానికి బదులుగా, సూపర్‌సానిక్ షాక్ వేవ్స్‌ను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎయిర్ క్రాఫ్ట్ రన్‌వేపై నుంచి బయల్దేరి మాక్ 6 వేగాన్ని మించి ప్రయాణించే అవకాశముంటుంది.
స్టార్‌గేజర్ ప్రజలకు అందుబాటులోకి వస్తే, కంకోర్డ్ తర్వాత శబ్ద వేగాన్ని మించి ప్రయాణిస్తూ ప్రయాణికులను తీసుకెళ్లిన మొదటి కమర్షియల్ విమానంగా రికార్డు సృష్టిస్తుంది. కంకోర్డ్ 20 ఏళ్ల క్రితం రిటైర్ అయింది. అది 60,000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. స్టార్‌గేజర్ అంతకన్నా వేగంతోపాటు, 1,10,000 అడుగుల ఎత్తులో ప్రయణిస్తుందని వీనస్ ఏరోస్పేస్ చెప్తున్నది. కంకోర్డ్ ప్రయాణికుల మాదిరిగానే స్టార్‌గేజర్ ప్రయాణికులు కూడా భూవక్ర రేఖను చూడగలుగుతారని చెప్తున్నది.