లక్నో: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వందే భారత్ రైలు (Vande Bharat Express train) ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది.
కాగా, రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నది. వందే భారత్ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వందే భారత్ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఆ రైలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు.
కాగా, వందే భారత్ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
BJP के ज़माने का इंजन खराब हो गया.
कांग्रेस के ज़माने का इंजन उसे खींच रहा है. pic.twitter.com/83tQjxrZSy
— Ranvijay Singh (@ranvijaylive) September 9, 2024