Vande Bharat Sleeper | భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను సైతం పట్టాలెక్కించబోతున్నది. ఈ రైలు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. తేజస్ రైలు తరహాలో వేగంగా.. రాజధాని రైలు లాంటి సౌకర్యాలు కలిగిన తొలిరైలు ఢిల్లీ-పాట్నా మార్గంలో నడువనున్నది. డిసెంబర్ చివరి నాటికి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. ఈ రైలు ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులన్నీ తుది దశలో ఉన్నాయి.
ఈ రైలును ప్రారంభోత్సవం కోసం ప్రయాణికులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నివేదిక ప్రకారం.. బెంగళూరులోని బీఈఎంఎల్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఈ వందే భారత్ స్లీపర్ రెండు రేక్‌లలో ఒకటి ఇప్పటికే పూర్తయ్యింది. తొలి రేక్ డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఢిల్లీ-పాట్నా మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలులో 16 కోచ్‌లు 827 బెర్త్‌లో ఉంటాయి. ఇందులో 611 థర్డ్ ఏసీ, 188 సెకండ్ ఏసీ, 24 ఫస్ట్ ఏసీ బెర్తులు ఉంటాయి. ఈ రైలును అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. రైలులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీతో సౌకర్యవంతమైన ఇంటీరియర్ ఉంటుంది.
ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించారు. ఇందులో కవచ్ సిస్టమ్, క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ వంటి అధునాతన భద్రత టెక్నాలజీ అమర్చారు. అవసరమైతే కోచ్ సంఖ్యను 24కు పెంచనున్నారు. ఢిల్లీ-రాజేంద్రనగర్ మార్గంలో తేజస్ మార్గంలో నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తుంది. రైలు సాయంత్రం పట్నా రాజేంద్రనగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి ఉదయం ఢిల్లీకి చేరుకుంటుంది. తిరిగి తేజస్ రైలు తరహాలోనే నడుస్తుంది. నెలాఖరు నాటికి వందే భారత్ స్లీపర్ రైలును రెగ్యులర్‌గా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా దానాపూర్ డివిజన్ ధ్రువీకరించింది.