కాట్రా: వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. ఆ సూచనలను పట్టించుకోలేదని వస్తున్న ఆరోపణలను శ్రీ మాతా వైష్ణవో దేవి బోర్డు(Vaishno Devi Board) కొట్టిపారేసింది. ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నమే యాత్రను నిలిపివేసినట్లు బోర్డు చెప్పింది. క్లౌడ్బస్ట్ జరడానికి ముందే భక్తుల క్షేమం దృష్ట్యా తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే త్రికూట పర్వతాల్లో జరిగిన ప్రాణ నష్టం గురించి మాత్రం బోర్డు ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. కాట్రా బెల్ట్ రూట్లో ఉన్న త్రికూట పర్వత శ్రేణుల్లో క్లౌడ్బస్ట్ వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 34 మంది యాత్రికులు చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు.
వాతావరణ హెచ్చరికలు పట్టించుకోకుండా యాత్రను కొనసాగించినట్లు గురువారం పలు మీడియాల్లో కథనాలు వెల్లబడ్డాయి. యాత్రికుల భద్రత గురించి ఏమాత్రం బాధ్యత లేదని ఆరోపించారు. ఆగస్టు 26వ తేదీన జరిగిన విపత్తు పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. మీడియా కథనాలను బోర్డు తప్పుపట్టింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నది. ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల వరకు యాత్ర మార్గం క్లియర్గా ఉందన్నారు. ఆ సమయంలో యాత్ర నార్మల్గా జరిగినట్లు చెప్పారు. హెలికాప్టర్ సేవల్ని కూడా కొనసాగించారు.
ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాస్క్ ఫోర్స్.. యాత్రికుల మార్గంలో పహారా కాసినట్లు బోర్డు తెలిపింది. స్వల్ప స్థాయి వర్షాలు పడనున్నట్లు హెచ్చరిక రావడంతో తక్షణమే రిజిస్ట్రేషన్లను ఆపేశామన్నారు. అప్పటికే చాలా మంది యాత్రికులు తమ యాత్రను పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. వేలాది మంది యాత్రికులు కాట్రా చేరుకున్నారు. కాట్రా నుంచి అధ్కువారి కొత్త మార్గాన్ని ఆగస్టు 24వ తేదీ నుంచే మూసివేశారు.