డెహ్రాడూన్: బ్యాడ్మింటన్ ఆటలో వివాదం కారణంగా పిల్లల మధ్య గొడవ జరిగింది. ఘర్షణగా మారడంతో 11 ఏళ్ల బాలుడు తన 9 ఏళ్ల స్నేహితుడ్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. (Boy Stabs Friend) ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జస్పూర్లోని చిపియన్ ప్రాంతానికి చెందిన కొందరు బాలురు షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు.
కాగా, ఆట మధ్యలో షటిల్‌కాక్ కాలువలో పడిపోయింది. ఆ షటిల్‌కాక్‌ను బయటకు తీసి తేవడంపై పిల్లల మధ్య విభేదాలు తలెత్తాయి. చిన్నపాటి వాదనగా మొదలైన గొడవ పెద్ద ఘర్షణగా మారింది. దీంతో ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కొట్టుకున్నారు. స్కూటర్‌పై కూర్చున్న తొమ్మిదేళ్ల బాలుడు, 11 ఏళ్ల ఫ్రెండ్‌ను షటిల్ కాక్‌తో కొట్టాడు. ప్రతిగా అతడు కూడా అదే విధంగా దాడి చేశాడు.
ఆ తర్వాత 9 ఏళ్ల బాలుడు బ్యాడ్మింటన్ రాకెట్‌తో అతడిపై దాడి చేశాడు. దీంతో 11 ఏళ్ల బాలుడు తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి అతడి ఛాతిపై పొడిచాడు. గాయపడిన ఆ బాలుడు సహాయం కోసం రోడ్డుకు అవతలి వైపున ఉన్న ఒక మెడికల్ షాపు వద్దకు అతికష్టంగా చేరుకున్నాడు. అయితే అక్కడ కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన 11 ఏళ్ల బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న పిల్లలు, ఇతర వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. అసలు ఏం జరిగిందో అన్నది తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే బ్యాడ్మింటన్ ఆట సందర్భంగా పిల్లల మధ్య మొదలైన గొడవ ఒక బాలుడి ప్రాణాలు తీసేందుకు దారి తీసిన ఈ సంఘటనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.