డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ హవా కొనసాగిస్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ 18 సాన్థాల్లో ఆధిక్యంలో ఉన్నది. మరో నాలుగు స్థానాల్లో నలుగురు ముందంజలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 మెజారిటీ స్థానాలు కాగా.. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెనుకంజలో ఉన్నారు.
ఖతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పుష్కర్ సింగ్ 7వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ ముందంజలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్లో ముఖ్యమంత్రి ధామికి 4,079 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీకి 4,372 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తంగా బీజేపీకి 37,254 ఓట్లు.. కాంగ్రెస్కు 44,479 ఓట్లు పోలయ్యాయి. మరో వైపు లాల్ కువాన్ స్థానం నుంచి బరిలో ఉన్న మాజీ సీఎం హరీశ్ రావత్ ఓటమి పాలయ్యారు.