న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకం, ఆర్థిక వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో శీతాకాల చార్ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టానికి కేదారేశ్వరుడి శీతాకాల విడిది అయిన ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయం వేదికైంది. సంప్రదాయ ప్రార్థనలు, క్రతువులతో కూడిన ప్రారంభోత్సవంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ఏడాది పొడవునా యాత్రికులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా సీఎం ధామి మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ను ఏడాది పొడవునా యాత్రికుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో శీతాకాల చార్ధామ్ యాత్ర గొప్ప ముందడుగని అన్నారు. మంచు ఎక్కువగా కురుస్తుందనే కారణంతో సంప్రదాయం ప్రకారం చార్ధామ్ యాత్రను శీతాకాలంలో నిలిపివేస్తారు. ఇక నుంచి ఆయా దేవతా మూర్తులు శీతాకాలంలో కొలువుండే ఆలయాలకు భక్తులు చార్ధామ్ యాత్ర చేయవచ్చు.