Uttarakhand Avalanche : ఉత్తరాఖండ్ (Uttarakhand) లో మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఇప్పటికీ ఆచూకీ దొరకని మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ అధికారి వినోద్ కుమార్ మీడియాతో చెప్పారు. రెండు రోజుల క్రితం చమోలీలో మంచు చరియలు విరగిపడటంతో నలుగురు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇంకో 50 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంవల్ల మంచు గుట్టల్లా పేరుకుపోయింది. ఈ క్రమంలో చమోలి జిల్లాలోని మన (Mana) గ్రామ సమీపంలోని చమోలి-బద్రీనాథ్ రహదారిపై ఏర్పాటు చేసిన బీఆర్వో శిబిరంపై పెద్దఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడ పనిచేస్తున్న 59 మంది బీఆర్వో కార్మికులు మంచులో చిక్కుకుపోయారు.
శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బీఆర్వో కార్మికులు ఎనిమిది కంటెయినర్లు, ఒక షెడ్డులో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 54 మందిని ప్రాణాలతో బయటికి తీశారు. వారికి మన గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందించారు.
వారిలో నలుగురు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరో నలుగురు కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదంలో మంచు చరియల కింద చిక్కుకున్న అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు.