Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఆస్తి వివాదం కారణంగా ఆమె భర్తే హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మీరట్ జిల్లా, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి, హర్రా పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. మృతురాలిని నిషా చౌహాన్ (45)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషా చౌహాన్ అనే మహిళ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే, బ్యూటీషియన్‌గా పని చేస్తుంది.
ఆమె భర్త ప్రదీప్ చౌహాన్. నిషాకు, ప్రదీప్‌కు ఇటీవల ఒక ఆస్తి వివాదం నడుస్తోంది. ఒక ల్యాండ్‌కు సంబంధించి ఎవరి పేరున రిజిష్టర్ చేసుకోవాలి అనే విషయంపై గొడవ జరిగింది. నిషా, ప్రదీప్.. ఇద్దరూ తన పేరున అంటే తన పేరున ల్యాండ్ రిజిష్టర్ చేసుకోవాలంటూ పట్టుబట్టారు. ఈ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన ప్రదీప్.. నిషాను కత్తితో పొడిచాడు. అనేకసార్లు నిషాను పొడవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ దాడిని అడ్డుకునేందుకు వారి 17 ఏళ్ల తనయుడు ప్రయత్నించగా, అతడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక, నిషాను హత్య చేసిన అనంతరం భర్త ప్రదీప్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు.
ఈ ఘటనపై శుక్రవారం ఉదయం స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్‌తోపాటు అతడి కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడికి ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఇక, ప్రదీప్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.