భోపాల్, జూలై 21: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ దుకాణాల యజమానులకు ఆ నగర మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. దుకాణం యజమాని పేరు, అతడి మొబైల్ నెంబర్‌తో దుకాణం బయట ‘నేమ్ ప్లేట్స్’ ఏర్పాటుచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ మార్గదర్శకాలు వెలువడ్డాయి. నిబంధనల్ని మొదటిసారి ఉల్లంఘించినట్టు తేలితే, రూ.2వేలు, రెండోసారి ఉల్లంఘించినట్టు రుజువైతే రూ.5వేలు జరిమానా విధిస్తామని ఉజ్జయిని మేయర్ ముకేశ్ తత్వాల్ హెచ్చరించారు.
ఉజ్జయిని నగరానికి వచ్చే పర్యాటకుల భద్రత, పారదర్శకత కోసం తప్ప, ముస్లిం దుకాణాదారులను టార్గెట్ చేయడానికి కాదని మేయర్ వివరించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్వస్థలం ఉజ్జయిని. ఇక్కడి మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించేందుకు భక్తులు దేశవిదేశాల నుంచి వస్తుంటారు. సోమవారం నుంచి శ్రావణ మాసం ఆరంభం కావటంతో, ఉజ్జయినికి భక్తుల తాకిడి భారీగా ఉంటుంది.
వారణాసి : శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర జరిగే మార్గంలోని మాంసం, పౌల్ట్రీ దుకాణాలను మూసివేయాలని వారణాసి నగర పాలక సంస్థ ఆదేశించింది. ఈ మార్గంలోని ఇటువంటి దుకాణాల మూసివేతకు సర్వే నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. కన్వర్ యాత్ర జరిగే ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాలు, తినుబండారాలను విక్రయించే బండ్ల వద్ద వాటి యజమానుల పేర్లను స్పష్టంగా కనిపించేలా రాయాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది.