డెహ్రాడూన్: ఒక వ్యక్తి రైలు పట్టాలపై డిటోనేటర్లు ఉంచాడు. (Detonators On Railway Track) రైల్వే కంట్రోల్ డివిజన్ నుంచి ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ)కు ఈ సమాచారం అందింది. వారు వెంటనే అక్కడకు చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడ్ని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేయడంతోపాటు మరి కొన్ని డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. హరిద్వార్-డెహ్రాడూన్ రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్లు ఉన్నట్లు ఆదివారం రాత్రి మొరాదాబాద్ రైల్వే డివిజన్ కంట్రోల్ రూమ్‌కు తెలిసింది. దీంతో హరిద్వార్ ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీపీ)కు సమాచారం ఇచ్చారు.
కాగా, జీఆర్పీ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల వద్ద ఉన్న డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అక్కడ అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగడాన్ని గమనించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా నిందితుడ్ని గుర్తించారు. మంగళవారం అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న పలు డిటోనేటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు పదార్థాలను రైలు పట్టాలపై ఎందుకు ఉంచాడన్న దానిపై నిందితుడ్ని పశ్నించనున్నారు.